‘హర్మూజ్’ వద్ద హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసి, రాడార్ సైట్లపై యూఎస్ దాడి!

  • జలసంధి వైపు దూసుకొచ్చిన 4 ఇరాన్ ఆత్మహుతి డ్రోన్లు
  • విజయవంతంగా కూల్చివేసిన అమెరికా దళాలు
  • ముప్పును ముందే పసిగట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ 
  • ఇరాన్ కోస్టల్ రాడార్ కేంద్రాలపై ఎదురుదాడి 
  • తాజా ఘర్షణతో ప్రమాదంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం
వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధి వైపు దూసుకొస్తున్న ఇరాన్‌కు చెందిన నాలుగు వన్-వే అటాక్ డ్రోన్లను (ఆత్మహుతి డ్రోన్లు) అమెరికా రక్షణ బలగాలు గాల్లోనే విజయవంతంగా కూల్చివేశాయి. ఆ వెంటనే ఇరాన్ వైపు నుంచి మరిన్ని దాడులు జరగకుండా నిరోధించేందుకు, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఇరాన్ కోస్టల్ సర్వైలెన్స్ (తీరప్రాంత నిఘా) రాడార్ కేంద్రాలపై యూఎస్ మిలిటరీ భీకర దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్త చమురు, సహజ వాయువు రవాణాలో అత్యధిక భాగం సాగే ఈ సముద్ర మార్గంలో తాజా ఘర్షణ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ పరిణామం పూర్తిగా బలహీనపరిచింది.

లక్ష్యంగా మారిన గోరుక్, ఖేష్మ్ ఐలాండ్
యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. సముద్ర మార్గంలో ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ డ్రోన్లు తక్షణ ముప్పుగా మారడంతో అమెరికా ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. డ్రోన్లను ధ్వంసం చేసిన అనంతరం, ఇరాన్ దక్షిణ తీర ప్రాంతమైన 'గోరుక్' లోని రాడార్ సైట్లతో పాటు, హర్మూజ్ జలసంధి పరిధిలోని అత్యంత కీలకమైన 'ఖేష్మ్' ద్వీపంలోని నిఘా కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. "అకారణంగా ఇరాన్ జరిపే దురాక్రమణలను ఎదుర్కొనేందుకు, ఆత్మరక్షణ కోసం మా బలగాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి" అని సెంటకామ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

మరోవైపు ఇరాన్ స్థానిక మీడియా కూడా ఈ సరిహద్దు ప్రాంతంలో సైనిక అలజడి జరిగినట్లు అంగీకరించింది. తమ బలగాలు హెచ్చరిక గుళ్లను కాల్చాయని పేర్కొన్నప్పటికీ, నష్టంపై పూర్తి వివరాలను వెల్లడించడానికి టెహ్రాన్ నిరాకరించింది. ప్రస్తుతానికి ఈ డ్రోన్ దాడి వల్ల వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.

చమురు మార్కెట్‌పై ప్రభావం 
గడిచిన కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-1 (MQ-1) డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడం, దానికి ప్రతిగా అమెరికా ప్రతీకార దాడులు చేయడం వంటి పరిణామాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కువైట్ వంటి గల్ఫ్ దేశాలు సైతం ఈ ఉద్రిక్తతల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రస్తుతానికి ఇరుపక్షాల నుంచి తదుపరి దాడుల సమాచారం అందనప్పటికీ, హర్మూజ్ జలసంధిలో సైనిక పహారాను భారీగా పెంచారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు తెరవెనుక దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది.

US Central Command
Iran
Strait of Hormuz
Iranian drones
US military strikes
Qeshm Island
Goruk radar sites
Oil price hike
Middle East tensions
US Iran conflict

More Telugu News